సిడ్నీ: ఇంటర్‌నెట్ సెర్చింజన్ ‘గూగుల్ ’ నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తంలో నష్ట పరిహారాన్ని పొందాడు. గూగుల్‌పై పరువు నష్టం కేసు వేసిన మిలోరాడ్ టర్కుల్జా (62) అనే ఆ వ్యక్తి ఏకంగా రూ. 1.14 కోట్లు (2,08000 డాలర్లు) పరిహారంగా తీసుకున్నాడు. తనకు నేరగాళ్ల ముఠాతో సంబంధాలున్నట్లు సమాచారాన్ని ఉంచిన గూగుల్ తనకు పరువునష్టం కలిగించిందంటూ అతడు కోర్టును ఆశ్రయించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్‌గా పనిచేసే తనను మెల్‌బోర్న్‌లోని ఓ ప్రముఖ నేరస్తుడిగా చిత్రిస్తూ గూగుల్‌లో సమాచారం ఉంచారని, దీనివల్ల తనకు తీవ్ర పరువునష్టం జరిగి, వ్యాపారం కూడా దెబ్బతిందని టర్కుల్జా వాదించారు.
2004లో జరిగిన ఓ నేర సంఘటనపై ఇప్పటికీ ఏమీ తేలలేదని, అయినా దానితో తనకు ముడిపెడుతూ నేరస్తుడిగా చిత్రించారని తెలిపాడు. ఇదే విషయంపై యాహూ సెర్చింజన్ నుంచి కూడా తాను ఇదివరకే రూ. 1.23 కోట్ల పరిహారాన్ని పొందినట్లు చెప్పాడు. అయితే, ఆ సమాచారాన్ని వేరే వ్యక్తులు ఉంచారన్న గూగుల్ వాదనను విక్టోరియా సుప్రీంకోర్టు తిరస్కరించింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న సమాచారాన్ని తొలగించాల్సిందిగా నోటీసులు పంపినా, చర్యలు తీసుకోవడంలో గూగుల్ విఫలమైనందున పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.
super sir
ReplyDelete