Saturday, 17 November 2012

శోకసముద్రం లో ముంబై :::శివసేన చీఫ్, మరాఠీ పులి బాల్ థాకరే కన్నుమూత..

శివసేన అధినేత బాల్ థాకరే కన్ను మూశారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోశ వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఈ ఏడాది జులై నుంచి ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.గత కొంతకాలంగా ఆయన తన నివాసం మాతోశ్రీలో వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు భార్య మీనా, కుమారులు జైదేవ్, ఉద్దవ్ ఉన్నారు. ఉద్ధవ్ థాకరే శివసేన ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉన్నారు. థాకరే శివసేనను 1966లో స్థాపించారు.
బాల్ థాకరే ఆరోగ్యం నిలకడగా ఉందని శనివారం ఉదయం ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు వార్త వచ్చింది. థాకరే 1926 జనవరి 23వ తేదీన రాంబాయ్, కేశవ్ థాకరే దంపతులకు జన్మించారు. కేశవ్ థాకరే సంఘ సంస్కర్త, జర్నలిస్టు. ఆ దంపతులకు పుట్టిన తొమ్మిది మంది సంతానంలో బాల్ థాకరే పెద్దవాడు. చిన్నతనంలోనే అతను తల్లి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు.
ముంబైలోని ఫ్రీ ప్రెస్ జర్నల్ న్యూస్ పేపర్‌లో కార్టూనిస్టుగా బాల్ థాకరే తన కెరీర్‌ను ప్రారంభించారు. పత్రిక యాజమాన్యంతో విభేదాలు వచ్చి ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా మామిక్ పేరుతో పత్రికను స్థాపించారు. ఉద్యోగాల్లో భూమి పుత్రులు మరాఠీలకు అన్యాయం జరుగుతున్న వైనాన్ని ఆయన తన పత్రికలో రాస్తూ వెళ్లారు.
థాకరే 1966లో పెట్టిన శివసేన పార్టీ తీవ్ర విమర్శలకు గురువుతూ వచ్చింది. హింసాత్మక చర్యలకు దిగుతోందంటూ, ద్వేషాన్ని రగిలిస్తోందంటూ ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠీ కార్డును వాడడం ద్వారా బలమైన వోటు బ్యాంకును ఆయన సృష్టించుకున్నారు. ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో 1973లో శివసేన తన సత్తా చాటింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ముంబై పరిసరాల్లోని నగరాలకు కూడా పార్టీ విస్తరించింది.
హిందూత్వ ఎజెండాతో సంఘ్ పరివార్ 1980 చివరలో, 1990 ప్రారంభంలో ముందుకు వచ్చింది. దాంతో థాకరే దాన్ని అందిపుచ్చుకున్నారు. హిందూత్వ ఎజెండాను స్వీకరించిన బాల్ థాకరే బిజెపితో కలిసి 1995 శాసనసభ ఎన్నికల్లో శివసేన విజయం సాధించింది. అయితే, 1999 ఎన్నికల్లో రెండు పార్టీల కూటమి ఓడిపోయింది. రాజ్ థాకరే పార్టీని చీల్చడంతో శివసేన 2006 కాస్తా బలహీనపడింది. నవనిర్మాణ సేన పేర రాజ్ థాకరే ఏర్పాటు చేసిన సంస్థ శివసేన ఓటు బ్యాంకుకు గండి కొట్టింది.
ముంబైలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన దసరా సంబరాల్లో తాను ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు వీడియో ప్రసంగం ద్వారా శివసైనికులకు చెప్పారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .