తీన్‌మారూ.. తీన్‌మారూ.. ఎందుకు ఆడలేదు.
శక్తీ..శక్తీ.. ఎందుకు నీరసించావ్.. కొమరం పులీ.. కొమరం పులీ.. ఎందుకు
గాండ్రించలేదు.. ఇలా క్వొశ్చన్లు అడుక్కుంటూ పోవడం కన్నా..
పర్‌ఫెక్టూ..పర్‌ఫెక్టూ ఎందుకు జనానికి నచ్చావ్..అని ఒక్క ప్రశ్న అడగడం
సులువేమో. కోట్ల నోట్ల వ్యాపారంపై ఆశలు, బినామీ లేదా జీతాల ప్రొడ్యూసర్లతో
పనులు కానివ్వడం తప్ప, కాసింత ఆలోచన కానీ, జనానికి ఏం కావాలో అన్న అంచనాలు
కానీ అస్సలు లేకపోతే ఇలాగే వుంటుందని ఎవరన్నా అంటే ‘అవునుగావోల్ను..’ అని
అనుకోవచ్చు. అప్పనంగా వచ్చినవో, లక్షల వడ్డీలు చెల్లించి తెచ్చిన కోట్లు
జనాలు సినిమాలు చూడక, నిర్మాతలు చూస్తూ చూస్తూ వుండగానే రీళ్లు
మింగేస్తున్నాయి.
తెలుగు సినిమా రేంజ్ భయంకరంగా పెరిగిపోయింది. విదేశాల్లో ముఖ్యంగా
అమెరికాలో మన జనాలు పెరగడంతో ఓవర్‌సీస్ ఆదాయం పెరిగింది. అలాగే మరో పక్క
శాటిలైట్ హక్కుల నుంచి వచ్చే సొమ్ము, ఇది కాక వీలయినంత హైప్ తీసుకువచ్చి,
థియేటర్లు బ్లాక్ చేసి, జనానికి సినిమా సంగతి తెలిసే లోగానే డబ్బులు
నొల్లేసుకోవచ్చన్న చెత్త అయిడియాలే తప్ప, డబ్బే కాకుండా వొళ్లు కూడా దగ్గర
పెట్టుకుని సినిమా తీద్దామన్న మంచి ఆలోచన చేసే సమయం మన బినామీ నిర్మాతలకు
లేకుండా పోతోంది. దర్శకులది కూడా నిర్మాతల వ్యవహారంలాగే తయారైంది. కొత్త
కొత్త ఆలోచనలు చేయడం వరకు బాగానే వుంది కానీ, మన నేటివిటీ, మన మూలాల సంగతి
మరిచిపోతున్నారు. తెలుగు సినిమా ఎంత విస్తరించినా, ఇప్పటికీ మన సినిమాకు
మహరాజ పోషకులు బీ..సీ సెంటర్ జనాలు, మహిళలే. వీరికి నచ్చని సినిమా ఆడలేదు
కాక ఆడలేదు. అడ్వాన్స్‌డ్ యూజ్ అండ్ త్రో ప్రేమ వ్యవహారాలు, ఇంటర్‌నెట్లు,
హైటెక్ మాఫియా వ్యవహారాలు వీరికి పట్టవుకాక పట్టవు. ఆ సంగతి విస్మరించిన
తీసిన ప్రతి సినిమా కథ కంచికి వెళ్లక పోగా, ప్రింట్లు నిర్మాత ఇంటి దారి
పట్టాయి. జనవరి నుంచి మే అంటే అయిదు నెలల్లో కనీసం ప్రతి నెలా 40 కోట్ల
వరకు రీళ్లపాలయ్యాయి. అంటే దాదాపు రెం డు వందల కోట్లు. అది ఎగ్జిబిటర్ల
సొమ్ము కావచ్చు.. నిర్మాతలది కావచ్చు. జనవరిలో ‘మిరపకాయ్’ ఒక్కటి
గట్టెక్కెంది. వాల్ట్‌డిస్నీ సొమ్ములతో తీసిన ‘అనగనగా ఓ ధీరుడు’, దాసరి
ప్రతిష్టాత్మక చిత్రం ‘పరమవీరచక్ర’ సినిమాలు కోట్లకు బోర్లాపడ్డాయి.
ముఖ్యంగా ‘పరమవీరచక్ర’ అతి ఘోరంగా దెబ్బతింది. ఈ రెండింటి బడ్జెట్ కలిపి
నలభై నుంచి యాభై కోట్ల వరకు వుంటుందని సినీ వర్గాల భోగట్టా. ఇక ఫిబ్రవరిలో
మంచు విష్ణు స్వంత ప్రొడక్షన్ ‘వస్తాడు నా రాజు’ కాస్తా, ఫలితం
రాబట్టకుండానే వెనుతిరిగింది. ఎంత స్వంత ప్రొడక్షన్ అయినా కనీసం పదికోట్లు
తినే వుంటుందని అంచనా. చిత్రమేమిటంటే జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన ‘గోల్కొండ
హైస్కూలు’ లాంటి చిన్న సినిమా ఫరవాలేదనిపించుకుంటే, ‘అలా.. మొదలైంది’
సినిమా పెట్టుబడికి అయిదు రెట్లు లాభం తెచ్చుకుని, సినిమా జనం ముక్కున
వేలేసుకునేలా చేసింది. జనవరిలో వచ్చిన మీడియమ్ బడ్జెట్ సినిమా ‘వాంటెడ్’
కూడా ప్రేక్షకులు ‘వాంటెడ్’ అని వెనుతిరిగింది. ‘గగనం’ లాంటి ద్విభాషా
చిత్రం కాస్త బడ్జెట్ దగ్గర పెట్టుకుని తీసింది కాబట్టి అలా అలా
గట్టెక్కింది అనుకోవచ్చు. రామ్‌గోపాల్ వర్మ వీర హడావుడి చేసిన ‘కథ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పలరాజు’ బాక్సాఫీసు వద్ద బాక్సు తనే్నసింది.
ఆపై ‘దొంగల ముఠా’ సంగతి చెప్పనక్కరే లేదు. నాటకానికి ఎక్కువ... సినిమాకు
తక్కువ టైపు అది. మార్చి నెలలో వచ్చిన ‘శక్తి’ ఈ ఏడాదికే పెద్ద అపజయం.
సుమారు 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా అందరి అంచనాలను
తల్లకిందులు చేసింది. ఆ తరువాత వచ్చిన ‘తీన్‌మార్’కు కూడా అదే పరిస్థితి
పట్టింది.
ఇన్ని డబ్బులు పోయాయన్న సంగతి పక్కన పెడితే పెద్దగా కొత్తదనం
లేకుండానే ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమా ఎలా హిట్టయిందని కూడా ఆలోచించడం
అవసరం. అందులో మన సగటు ప్రేక్షకులకు నచ్చే రిలీఫ్ వుంది. వినోదం వుంది.
మీదుమిక్కిలి గందరగోళపు, మేధావితనపు వెర్రిపోకడలకు నిదర్శనమైన వెర్రిమొర్రి
ఆర్గ్యుమెంట్లు, టెక్నాలజీ హడావుడి లేదు. ప్రతి ఫ్రేమ్ జనం కళ్లకు అలసట
నిచ్చేదిగా, హడావుడిగా కాకుండా, హాయిగా వుండడం ప్లస్సయింది. ఎంత అయినా మన
సగటు సినీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు ఫ్రేమ్‌లు నిలకడగా కాస్తయినా కనపడాలి.
హీరోయిన్‌ను కాస్త చూడగలగాలి. ఇష్టం వచ్చినట్లు మూడు నాలుగు కెమేరాలు
వాడేసి, ముక్కలు ముక్కలు చేసి, సెకెండ్‌కో ముక్కను తెరపై తిప్పే గందరగోళపు
విధానాలకు మన ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. మంచి సినిమా కోసం మన సినీ
జనాలు ఎంతలా మొహం వాచి వుంటున్నారంటే, చెత్త సినిమాల నడుమ కాస్త కుదురుగా
వున్న సినిమా ఏ మాత్రం బాగున్నా అక్కున చేర్చుకుంటున్నారు. ‘అలా..
మొదలైంది’, ‘అహ.. నాపెళ్లంట’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలు ఆడడానికి
కారణం అదే. అవే మంత మంచి సినిమాలని ఎవరూ సర్ట్ఫికెట్లు ఇవ్వలేదు. కానీ
చెడ్డలో కాస్త మంచి చెడ్డ అన్న తీరుగా అవి నెగ్గుకొచ్చాయి. కానీ ఇవేవీ
ఆలోచించకుండా, స్టార్‌కాస్టింగ్, భారీతనం, పబ్లిసిటీ హైప్‌నే నమ్ముకుని
జూదమాడుతున్న వారి కారణంగా తెలుగు సినిమారంగంలో కోట్ల రూపాయిలు
రీళ్లపాలవుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే ఆత్మహత్యలపై సినిమాలు తీయడం కాదు..
సినిమా రంగమే ఆత్మహత్యాసదృశంగా తయారవుతుందేమో?
అగ్రదర్శకుడు దాసరి నేరుగా మన హీరోలకు కథలు జడ్జి చేసే సత్తాలేదని సంచలన
వాఖ్యలు చేసాడు. కథలు జడ్జి చేయడం ఎలా వున్నా, దర్శకులను ఎంచుకోవడం కూడా
సరిగా తెలియదేమో అనిపిస్తుంది ఇటీవల సినిమాలు చూస్తుంటే. ఇటీవల భారీగా
బోల్తాపడ్డ సినిమా డైరక్టర్‌కు కనీసం రివర్స్ సీన్‌కు క్లాప్ ఎలా కొడతారో
కూడా తెలియదని, కేవలం వివిధ కారణాల రీత్యా అవకాశాలు కట్టబెట్టడం తప్ప,
సిసలైన సామర్ధ్యం గలవారికి సినిమా రంగంలో గుర్తింపు తక్కువేనని ఓ
అసిస్టెంట్ డైరక్టర్ వ్యాఖ్యానించాడు. కేవలం పైరవీలు, లయిజినింగ్ వంటివే
ప్రభావం చూపిస్తున్నాయని, నందినీరెడ్డి లాంటి వాళ్లు ఎక్కడో ఒకరిద్దరు
మాత్రమే అవకాశాలు స్వంతం చేసుకోగలుగుతున్నారని సినిమా రంగంలో గుసగుసలు
వుండనే వున్నాయి. ‘నిజానికి ఇప్పుడున్న అగ్రదర్శకులంతా ఒకప్పుడు యువకులుగా,
కొత్త దర్శకులుగా అవకాశాలు సంపాదించి, మంచి హిట్లు ఇచ్చారు. ఇప్పుడు వీరి
సత్తా పూర్తయింది. కొత్త కుర్రాళ్లకు వీరు దారి ఇవ్వాలి’ అని ఓ అసోసియేట్
దర్శకుడు తన భావనలు వ్యక్తం చేసాడు. కృష్ణవంశీ ఫ్లాప్‌లు ఇస్తుంటే అతని
అసోసియేట్ నందినీ రెడ్డి హిట్ ఇవ్వడాన్ని ఈయన ఉదాహరణగా చూపారు. మరో పక్క మన
సినిమాల్లో స్టార్ కాస్టింగ్ కూడా పాత్రలను బట్టి కాకుండా, హీరో, దర్శకుడు
వారి కోటరీకి అనుగుణంగా జరుగుతున్నాయని, అది కూడా సినిమా విజయంపై ప్రభావం
చూపిస్తోందని విమర్శలు వున్నాయి. ఏది ఏమైనా తెలుగుసినిమాకు ఆత్మవిమర్శ
అవసరం చాలా వుందన్నది వాస్తవం. అది జరిగే వరకు రీళ్లు ఇలా కోట్లు
మింగేస్తూనే వుంటాయి.